ఆసియా

14/03/2012 05:07

ఆరంభం అదుర్స్

 

ఆసియా కప్‌లో భారత్ బోణి

సెంచరీలతో చెలరేగిన గంభీర్, కోహ్లి శ్రీలంకపై ఘన విజయం

బౌలర్ల సమష్టి ప్రదర్శన మరోసారి భారత్... లంకపై తమ జోరును కొనసాగించింది. కోహ్లి వరుసగా రెండో సెంచరీతో విజృంభించగా... గంభీర్ చాన్నాళ్ల తర్వాత మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆపై బౌలర్లు సమష్టిగా రాణించి లంకను కట్టడి చేశారు. మొత్తానికి పీడకలగా మిగిలిన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ ఓ మంచి విజయంతో ఆసియా కప్ టోర్నీని ఆరంభించింది. ఢాకా: ఉపఖండంలో భారత్ తమ పూర్వపు ఆటతీరును ప్రదర్శించింది

. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టే ఆసియా కప్‌లో సమష్టి ఆటతీరును ప్రదర్శించింది. తొలుత ఓపెనర్ గౌతం గంభీర్ (118 బంతుల్లో 100; ఫోర్లు 7), విరాట్ కోహ్లి (120 బంతుల్లో 108; ఫోర్లు 7) సెంచరీలతో విజృంభించారు. చివరి ఓవర్లలో కెప్టెన్ ధోని (26 బంతుల్లో 46; ఫోర్లు 6; ఓ సిక్స్), సురేశ్ రైనా (17 బంతుల్లో 30; ఫోర్లు 3; ఓ సిక్స్) విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరును సాధించి పెట్టగా బౌలర్లు మిగతా పనికానిచ్చారు. ఫలితంగా షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది.

మొదట భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 304 పరుగులు చేసింది. కోహ్లి తన సూపర్ ఫామ్‌ను ఇక్కడా కొనసాగించగా అటు గంభీర్ 15 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీ చేశాడు. వీరిరువురు మూడో వికెట్‌కు 205 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహరూఫ్‌కు రెండు, లక్మల్‌కు ఓ వికెట్ దక్కింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.1 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటయ్యింది. జయవర్ధనే (59 బంతుల్లో 78; ఫోర్లు 10; సిక్స్ 2), సంగక్కర (87 బంతుల్లో 65; ఫోర్లు 2; ఓ సిక్స్) మాత్రమే రాణించారు. ఇర్ఫాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, వినయ్‌లు మూడేసి వికెట్లు తీశారు.

కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

టోర్నీలో తర్వాతి మ్యాచ్ 15న పాక్, శ్రీలంకల మధ్య జరుగుతుంది.

సూపర్ భాగస్వామ్యం టాస్ గెలిచిన శ్రీలంక... భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆరంభంలో ఓపెనర్లు గంభీర్, సచిన్ (19 బంతుల్లో 6; ఓ ఫోర్) డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరో ఓవర్‌లో లక్మల్ మాస్టర్‌ను అవుట్ చేశాడు. ఫుల్ టాస్ బంతిని షార్ట్ ఎక్స్‌ట్రా కవర్ వైపు పుష్ చేయగా జయవర్ధనే తక్కువ ఎత్తులో క్యాచ్ పట్టాడు. అయితే దీనిని నో బాల్‌గా సచిన్ సందేహించాడు. అయితే థర్డ్ అంపైర్ పరీశీలనలో అది సరైన బంతేనని తేలింది. దీంతో మాస్టర్ వెనుదిరగక తప్పలేదు. ఈ దశలో కోహ్లితో కలిసి గంభీర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. 36 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న గంభీర్ 59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లి 66 బంతుల్లో పూర్తి చేశాడు. క్రీజులో సమన్వయంతో కదులుతూ ఇరువురూ సెంచరీల దిశగా దూసుకెళ్లారు. ఈ సమయంలో 94 పరుగుల వద్ద మరోసారి గంభీర్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సగం క్రీజుదాకా పరిగెత్తిన గంభీర్ తిరిగి వెనక్కి రాగా చండిమాల్ నేరుగా విసిరిన బంతి వికెట్ల పక్కనుంచి వెళ్లింది. 42వ ఓవర్‌లో ఇద్దరూ తమ శతకాలను పూర్తి చేశారు. తర్వాతి ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో గంభీర్, కోహ్లిలను మహరూఫ్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ధోని, రైనా చెలరేగడంతో చివరి ఏడు ఓవర్లలో 78 పరుగులు సమకూరాయి. చివరి బంతిని రైనా సిక్స్‌గా మలిచి భారత్ స్కోరును 300 పరుగులు దాటించాడు.

కుప్పకూలిన మిడిలార్డర్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక తమ ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించింది. ముఖ్యంగా కెప్టెన్ జయవర్ధనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫామ్‌లో ఉన్న దిల్షాన్ (7)ను తక్కువ స్కోరుకే ఇర్ఫాన్ పెవిలియన్‌కు పంపాడు. సంగక్కర జత చేరడంతో మైదానంలో బౌండరీల వరద పారింది. అటు జయవర్ధనే 40 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి ఇర్ఫాన్ రంగంలోకి దిగి విడదీశాడు. జయవర్ధనే కీపర్ ధోనికి క్యాచ్ ఇవ్వడ ంతో రెండో వికెట్‌కు 93 పరుగులు భాగస్వామ్యానికి తెర పడింది. బాధ్యతాయుతంగా ఆడిన సంగక్కర 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నెమ్మదిగా లంక లక్ష్యం వైపు సాగుతుండగా స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 36వ ఓవర్‌లో సంగక్కర, తిరిమన్నె (37 బంతుల్లో 29; ఓ సిక్స్)ను అవుట్ చేశాడు. అలాగే 39వ ఓవర్‌లో వినయ్ వరుస బంతుల్లో కులశేఖర (11), కపుగెడెరనును పెవిలియన్‌కు పంపడంతో లంక పరాజయం ఖాయమైంది. టెయిలెండర్లు త్వరత్వరగా వికెట్లు పారేసుకోవడంతో 254 పరుగులకు ఆలౌటయ్యింది.

స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: గంభీర్ (సి) తరంగ (బి) మహరూఫ్ 100; సచిన్ (సి) జయవర్ధనే (బి) లక్మల్ 6; కోహ్లి (సి) తిరిమన్నె (బి) మహరూఫ్ 108; ధోని నాటౌట్ 46; రైనా నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 7; వైడ్లు 7) 14; మొత్తం (50 ఓవర్లలో మూడు వికెట్లకు) 304.

వికెట్ల పతనం: 1-19; 2-224; 3-226.

బౌలింగ్: కులశేఖర 10-0-67-0; లక్మల్ 10-1-67-1; దిల్షాన్ 10-0-54-0; ప్రసన్న 9-0-45-0; మహరూఫ్ 10-0-57-2; కపుగెడెర 1-0-7-0.

శ్రీలంక ఇన్నింగ్స్: జయవర్ధనే (సి) ధోని (బి) ఇర్ఫాన్ 78; దిల్షాన్ (సి) కోహ్లి (బి) ఇర్ఫాన్ 7; సంగక్కర (సి) జడేజా (బి) అశ్విన్ 65; చండిమాల్ (బి) అశ్విన్ 13; తిరిమన్నె (ఎల్బీడబ్ల్యు) (బి) అశ్విన్ 29; కులశేఖర (బి) వినయ్ 11; తరంగ (బి) ఇర్ఫాన్ 17; కపుగెడెర (సి) కోహ్లి (బి) వినయ్ 0; మహరూఫ్ (సి) రైనా (బి) వినయ్ 18; ప్రసన్న (సి) సచిన్ (బి) ఇర్ఫాన్ 8; లక్మల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2; వైడ్లు 6) 8; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 254.

వికెట్ల పతనం: 1-31; 2-124; 3-152; 4-196; 5-198; 6-216; 7-216; 8-241; 9-254; 10-254.

బౌలింగ్: ఇర్ఫాన్ 8.1-1-32-4; ప్రవీణ్ 7-0-47-0; వినయ్ 9-0-55-3; జడేజా 4-0-31-0; రైనా 5-0-34-0; అశ్విన్ 9-0-39-3; రోహిత్ 3-0-14-0. మ్యాచ్ విశేషాలు..

వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు (రెండు సార్లు) చేసిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (80) పది సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లి. గ్రీనిడ్జ్ (99 ఇన్నింగ్స్)ది తర్వాతి స్థానం గంభీర్ వన్డే కెరీర్‌లో ఇది పదో సెంచరీ, అన్ని ఫార్మాట్లలో కలిపి అతడు 54 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ సాధించాడు. ఇక్కడ భారీ స్కోరు చేసినా కష్టమే: ధోని
‘ఈ మైదానంలో రెండోసారి బౌలింగ్‌కు దిగడం చాలాకష్టం. అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంది. అలాగే బంతి కూడా బ్యాట్ మీదికి వస్తోంది. దీంతో వికెట్లు తీసేందుకు బౌలర్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే భారీగా స్కోరు చేసినా ఆందోళనగానే ఉంటుంది. టోర్నీ జరిగే కొద్దీ ఇక్కడి వికెట్ స్లో అవుతుందని ఆశిస్తున్నాను. జయవర్ధనే బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగించింది. గంభీర్ బ్యాటింగ్ బావుంది. అలాగే కోహ్లి వికెట్ల మధ్య పరిగెత్తిన తీరు ప్రశంసనీయం. ఈ జోడి మధ్య భాగస్వామ్యాన్ని గమనిస్తే తొలి 75 పరుగుల్లో ఎక్కువగా సింగిల్స్, రెండు పరుగులే ఉన్నాయి. రైనా, నేను సహజసిద్ధంగా ఆడేందుకు వీరు చక్కటి వేదికను సృష్టించారు’
‘గంభీర్‌తో మంచి అవగాహన ఉంది’
‘పరిస్థితులకు తగ్గట్టు వేగంగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. గంభీర్‌కు, నాకు మంచి అవగాహన ఉంది. ఒకరి ఆట మరొకరికి బాగా తెలుసు. ఇద్దరి మధ్య గతంలోనూ మంచి భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. అందుకే క్రీజులో మేం పెద్దగా మాట్లాడుకోలేదు. వికెట్ స్లోగా ఉన్నప్పుడు భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి సారించాం. అలాగే 23 ఏళ్లకే జట్టు వైస్ కెప్టెన్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ - కోహ్లి (భారత బ్యాట్స్‌మన్)

‘చెత్త షాట్‌తో ఔటయ్యా’ ‘కీలక దశలో ఓ చెత్త షాట్ ఆడాను. ఆరంభంలో మా ఆటతీరు బావుంది. మైదానంలో చాలా తప్పులు చేశాం. ఇలాంటి టోర్నీల్లో ఓ ఓటమి ఫలితాన్ని మారుస్తుంది. 20 పరుగుల దాకా అదనంగా ఇచ్చాం. గంభీర్, కోహ్లి మధ్య భారీ భాగస్వామ్యం మమ్మల్ని దెబ్బతీసింది. ధోని, రైనాలకు బౌలింగ్ చేయడం కష్టం. ఫీల్డింగ్‌లోనూ మెరుగవ్వాలి. లక్మల్, ప్రసన్న ఆకట్టుకున్నారు’ - జయవర్ధనే (శ్రీలంక కెప్టెన్)