FROM towards ASIA CUP STARTS

11/03/2012 16:07

 

బంగ్లా, పాక్ మధ్య తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంప్‌గా భారత్ అన్ని జట్లదీ అదే పరిస్థితి. ఓ పెద్ద టైటిల్ సాధించాలనే తపన. ఈ నేపథ్యంలో ఉపఖండపు జట్ల మధ్య ఆసియా కప్ టోర్నీకి నేడు తెరలేవనుంది. ఆసీస్‌లో ఎదురైన ఘోర పరాజయాలకు కొంతైనా ఉపశమనం లభించాలంటే ఈ టోర్నీలో భారత్ విశేషంగా రాణించాల్సిఉంది. సచిన్ ఆడుతుండటం, పాకిస్థాన్‌తో మ్యాచ్ ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఢాకా: బెంబేలెత్తించే స్వింగ్... విశాలమైన మైదానాలకు కాసేపు సెలవు. అన్నీ అలవాటైన పరిస్థితులే. క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికర టోర్నీ కన్నులపండుగ చేయనుంది. ఆసియా ఖండంలోని నాలుగు ప్రధాన జట్ల మధ్య జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. మూడోసారి ఆతిథ్యమిస్తున్న బంగ్లాదేశ్‌లో ఆదివారం నుంచి ఈనెల 22 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగబోతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తోపాటు పాకిస్థాన్, శ్రీలంక కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో అద్వితీయంగా రాణించి రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పాక్‌తో పాటు అండర్‌డాగ్‌గా బరిలోకి దిగుతున్న బంగ్లాదేశ్ తమ సత్తా చూపేందుకు ప్రయత్నిస్తోంది. 12 రోజులపాటు జరిగే ఈ కప్‌లో నాలుగు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరుగుతాయి. అన్నీ డే అండ్ నైట్ మ్యాచ్‌లే. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థిపై ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడుతుంది. దీంతో ఫైనల్ చేరే జట్లకు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.